రైతులను తప్పుదోవ పట్టించొద్దు..రాజకీయ లబ్ధికే బీజేపీ, బీఆర్ఎస్ డ్రామా  : మంత్రి జూపల్లి కృష్ణారావు

రైతులను తప్పుదోవ పట్టించొద్దు..రాజకీయ లబ్ధికే బీజేపీ, బీఆర్ఎస్ డ్రామా  :  మంత్రి జూపల్లి కృష్ణారావు
  • ప్రతిపక్షాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం
  • జూరాలపై కేటీఆర్, హరీశ్​కు స్పష్టత లేదు.. కర్నాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు ప్రయత్నిస్తున్నం: వాకిటి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జూరాల నీటి విషయంలో రైతు లను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఈ విషయంపై కొం దరి హంగామా చూస్తుంటే.. వారికి రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు కనిపిస్తోందని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ తీరుపై మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీలో మంత్రి వాకిటి శ్రీహరి, కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు మధుసూదన్‌‌‌‌రెడ్డి, మేఘారెడ్డితో కలిసి మీడియాతో మంత్రి మాట్లాడారు.

తమ ప్రభుత్వం జూరాలకు నీటిని విడుదల చేయించే ప్రయత్నంలో ఉందని తెలిసినా.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని ఫైర్‌‌‌‌ అయ్యారు. జూరాలలో నీరు లేకపోయినా విడుదల చేయాలని ఆ రెండు పార్టీలు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నాటక నుంచి నీటిని విడుదల చేయించేందుకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, మంత్రులు ఆ సర్కార్‌‌‌‌తో చర్చిస్తున్నట్టు స్పష్టం చేశారు.

జూరాలలో నీటి లెక్కలివే..

జూరాలలో 2.5 టీఎంసీల సిల్ట్‌‌‌‌ ఉందని, మరో మూడు టీఎంసీలు డెడ్‌‌‌‌ స్టోరేజీ ఉందని జూపల్లి తెలిపారు. మరో 2.5 టీఎంసీలను తాగునీటి కోసం కేటాయించామని, ఒక టీఎంసీ ఆవిరిగా మారుతుందని చెప్పారు. 7 టీఎంసీలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం అసాధ్యమనే విషయం కేసీఆర్‌‌‌‌కు తెలియదా? అని ప్రశ్నించారు. జూరాల వద్ద ఈ పరిస్థితి రావడానికి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పదేండ్ల పాలనే కారణమన్నారు. ఆనాడే గట్టు, భూత్పూర్‌‌‌‌, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

అవసరమైతే బీజేపీ, బీఆర్ఎస్​ నేతలు అధికారులతో కలిసి జూరాలను పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. రైతులను తప్పుదోవ పట్టిస్తే ఏం లాభం ఉండదన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాస్తవాలను పక్కన పెట్టి రైతుల్లో ఆందోళన కలిగించడం ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ప్రాజెక్టు నీళ్లపై అవగాహన లేకుండా ప్రతీది రాజకీయం చేయడం తగదని జూపల్లి హితవు పలికారు.

రైతుల ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదన్నారు. జూరాలలో ఉన్న నీటిపై కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌ రావుకు స్పష్టత లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పదేండ్లలో జూరాలలో కనీసం పూడిక కూడా తీయలేదని, భూ ఆక్రమణలు బయటపడడంతోనే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ డైవర్షన్‌‌‌‌ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. కర్నాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి తెలిపారు.